ఓట్లడిగే నైతిక హక్కు.. ఈ పార్టీలకు లేదు...!!
" పాలకవర్గంలో ఏ సభ్యుడు పార్లమెంటు ద్వారా ప్రజలను అణచివేయాలో, నలిపివేయాలో ప్రతీ కొద్దీ సంవత్సరాలకు ఒకసారి నిర్ణయించడమే బూర్జువా పార్లమెంటరిజపు నిజమైన సారం. పార్లమెంటరీ రాజ్యాంగబద్ధ రాజరిక దేశాలలో మాత్రమే కాదు, అత్యంత ప్రజాస్వామిక రిపబ్లిక్కుల్లో కూడా ఇదే జరుగుతుంది." అంటారు కామ్రేడ్ లెనిన్ ʹ రాజ్యం - విప్లవం ʹ లో.
కామ్రేడ్ లెనిన్ చెప్పింది ʹ అత్యంత పెద్ద ప్రజాస్వామికం ʹ అని చెప్పుకునే మన అర్ధ వలస - అర్ధ భూస్వామ్య దేశానికి మరింతగా వర్తిస్తుంది. అందుకే ఈ ఎన్నికల ద్వారా ఎవరు గెలిచినా తమ బతుకులు మారతాయని కానీ,ఈ వ్యవస్థలో మౌలిక మార్పు వస్తుందని కానీ ఈ దేశ పీడిత ప్రజలెవ్వరూ నమ్మడం లేదు. దేశంలో ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లోనూ గణనీయమైన సంఖ్యలోనే ఓటర్లు ఓటింగ్ కు దూరంగానే ఉండిపోతున్నారు. ఏ పార్టీకి బలముంటే వాళ్ళు తమ గూండా, అధికార బలంతో పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకొని రిగ్గింగ్ లకు పాల్పడుతున్నారు.ఓట్లు వేస్తున్నవారు కూడా ఎన్నికలు తమకేదో ఒరగబెడతాయనే నమ్మకంతో కాక స్థానిక అవసరాల కోసమో, కూలీ, మతం,ప్రాంతీయత, డబ్బు, మద్యం, గూండాయిజం తదితర వత్తిళ్లతోనో లేదా ప్రలోభాలతోనో ఓట్లు వేస్తున్నారు. లేదా అధికారంలో ఉన్న పార్టీపై వ్యతిరేకతతో మరో పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. ఈ బూటకపు పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజలకు ప్రత్యామ్నాయం లేదు.
ఎన్నికల్లో ముందుకు వస్తోన్న ప్రధాన పార్టీలన్నీ సామ్రాజ్యవాదులకు ఊడిగం చేస్తూ, భారత దోపిడీ పాలకవర్గాలకు ప్రాతినిధ్యం వహించేవి మాత్రమే. ఈ పార్టీలన్నీ ప్రజావ్యతిరేక,ద్రోహపూరిత,అవినీతికర,ప్రజాపీడక, అభివృద్ధి నిరోధక, ఫాసిస్ట్ స్వభావం కలిగినవే. సామ్రాజ్యవాదం, దళారీ నిరంకుశ బూర్జువా వర్గం, బడా భూస్వామ్య వర్గాల ప్రయోజనాలను కాపాడటమూ, భారత అర్ధవలస - అర్ధ భూస్వామ్య వ్యవస్థను నిలిపి ఉంచడమూ, అన్ని ప్రజాస్వామిక, విప్లవ ఉద్యమాలను అణచివేయడం, విద్వేష వాతావరణం సృష్టించి మేధోవర్గం నోరునొక్కడం ఈ పార్టీల లక్ష్యం. వీటికి ప్రత్యామ్నాయంగా ముందుకొస్తున్న మావోయిస్టు పార్టీని, దాని నాయకత్వంలో సాగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని, నిజమైన ప్రజాస్వామ్యం,స్వావలంబనల పై ఆధారపడిన భారత ప్రజల ప్రజాస్వామిక రిపబ్లిక్కుల సమాఖ్య కు ప్రాతినిధ్యం వహిస్తూ మొగ్గ తొడుగుతోన్న నూతన రాజకీయాధికార అంగాలను సమూలంగా నాశనం చేయడానికి ఈ పార్టీలు ఏకమవుతున్నాయి. దోపిడీలో వాటాల కోసం ఈ దళారీ పార్టీలు పార్లమెంటు పండులదొడ్లో అధికారం కోసం పొర్లాడుతూ పరస్పరం ఎంత తీవ్రంగా కొట్లాడుకుంటున్నప్పటికీ.. ʹ దేశ అంతర్గత భద్రతకు అత్యంత ప్రమాదకారిʹ అనే పేరుతో విప్లవోద్యమాన్ని తుడముట్టించే విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతోనే వున్నారు. అమెరికా నిర్ధేశిత ఎల్ ఐ సి వ్యూహం - ఎత్తుగడలకు అనుగుణంగా అత్యంత తీవ్ర స్థాయిలో బహుముఖ దాడికి దిగుతున్నారు. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ అనకొండ లాంటి పేర్లతో కేంద్రం, ఆయా రాష్ట్రంలో ప్రభుత్వాలతో కలిసి ప్రజలపై తీవ్ర స్థాయిలో యుద్ధం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుల్ని పాశవికంగా నొక్కేస్తున్నారు. బెదిరించో, జైళ్లల్లో పెట్టో, చంపేసో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.ఈ అణచివేత ద్వారా కుళ్లి కంపుకొడుతోన్న ఈ దోపిడీ వ్యవస్థను కాపాడాలని విఫలప్రయత్నం చేస్తున్నారు. కానీ రోజురోజుకూ విప్లవ పరిస్థితులు పరిపక్వమవుతోన్న నేపథ్యంలో గొప్ప ప్రజా వెల్లువలో వాళ్ళు కొట్టుకుపోకతప్పదు.
ఎన్నికల ద్వారా ప్రస్తుత దోపిడీ వ్యవస్థలో మార్పురాదు. ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావు.వారి కనీస ప్రాధమిక అవసరాలు కూడా నెరవేరవు. ఈ ఎన్నికల పార్టీలన్నీ ప్రజల నిజమైన ప్రజాస్వామ్యం,స్వావలంబన, దేశ సార్వభౌమత్యానికి పూర్తిగా వ్యతిరేకం . వీటి పేరు చెప్పి ప్రజల్ని ఓట్లు అడిగే నైతిక అర్హత వీటిలో ఏ పార్టీకీ లేదు. ఎన్నికల ద్వారా సాధించేది ఏమీ లేదు.ఎవరికీ వీటి పట్ల భ్రమలు కూడా లేవు.ఈ తంతుని ఇంకా భరించడం అనవసరం. భారత ప్రజల ప్రజాస్వామిక రిపబ్లిక్కుల సమాఖ్య నిర్మాణం కోసం దున్నేవారికే భూమి ప్రాతిపదికన ,వ్యవసాయ విప్లవమే ఇరుసుగా సాగుతోన్న దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథాలో సాగడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. పోరాటం ద్వారా ఏర్పడే నూతన ప్రజాస్వామిక రాజ్యం కార్మిక వర్గ నాయకత్వంలో కార్మిక - కర్షక మైత్రీ పునాదిగా కార్మికవర్గం,రైతాంగం, పెటీబూర్జువా వర్గం, జాతీయ బూర్జువా వర్గాలతో కూడిన ఐక్యసంఘటన ద్వారా ప్రజల ప్రజాస్వామిక నియంతృత్వాన్ని అమలుచేస్తుంది.సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ బూర్జువా, బడా భూస్వాముల కబంధ హస్తాల నుంచి ఈ దేశాన్ని విముక్తి చేస్తుంది.
ఈ బూటకపు ఎన్నికలను,బూటకపు పార్టీలను తిప్పికొడదాం.
ప్రజాస్వామిక ఆకాంక్షల్ని ఎత్తిపడదాం.
మూగబోతున్న గొంతుల్ని వికసింప చేద్దాం!
- మోహన సుందరం
Nessun commento:
Posta un commento