sabato 19 ottobre 2019

pc 19 ottobre - India - seminario per il Centenario di Charu Mazumdar

భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు

భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
శతజయంతి సదస్సు, హైదరాబాదు
కలలు కనలేనివారు
ప్రజలను కలల్లో ముంచెత్తలేనివారు విప్లవకారులు కాదు
- చారుమజుందార్‌
ఆయన అద్భుతమైన సాహసి. ఏటికి ఎదురీదాడు. ఒక తరాన్ని విప్లవంలోకి నడిపించాడు. అనేక
తరాలకు విప్లవోత్తేజాన్ని అందించాడు. ఆలోచనలను ఆచరణగా మార్చడంలో సాటిలేని నిపుణుడు. సాయుధ పోరాట రాజకీయాలకు తిరుగులేని ప్రతినిధి. కా. చారుమజుందార్‌ భారత విప్లవోద్యమ నాయకుడు. ఇది ఆయన శతజయంతి సంవత్సరం.
నక్సల్బరీ ఉద్యమం నాటికి ఆయన ఓ జిల్లా స్థాయి నాయకుడు. కానీ ప్రపంచ విప్లవ పరిణామాలను చాలా ముందుచూపుతో పసిగట్టాడు. కా. మావో నాయకత్వంలోని చైనా సాంస్కృతిక విప్లవంతో ఉత్తేజితుడయ్యాడు. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో పాతుకపోయిన రివిజనిజంతో తలపడ్డాడు. దాని వెన్ను విరిచాడు. నక్సల్బరీ పోరాటానికి నాయకత్వం వహించాడు. ఒక ఊళ్లో జరిగిన రైతాంగ సాయుధ ప్రతిఘటన నుంచి ఈ దేశ విప్లవ పంథాను నిర్మించాడు. జాతీయ, అంతర్జాతీయ విప్లవ పరిస్థితిని సూక్ష్మస్థాయిలో అర్థం చేసుకోవడం వల్లే విప్లవాన్ని ఎజెండా మీదికి తీసుకొచ్చాడు. నక్సల్బరీ మార్గంలోకి వచ్చిన కమ్యూనిస్టుల్లోని రివిజనినిస్టు ప్రమాదాన్ని కూడా గుర్తించాడు. వాళ్లతోనూ రాజీ లేకుండా పోరాడాడు. సాయుధ విప్లవ పంథాను దృఢంగా ప్రజలకు అందించాడు.

శతజయంతి జరపడమంటే చారుమజుందార్‌ విప్లవ పాత్రను ఎత్తిపట్టడమే. ఈ తరానికి అందించడమే. ఏ రూపంలో ఎక్కడ రివిజనిజం ఉన్నా దాన్ని గుర్తించి తుత్తినియలు చేయడమే. సాయుధ విప్లవ పంథాను ముందుకు తీసకపోవడమే. ఇవీ ఆయన మూర్తిమత్వంలోని ప్రధాన విషయాలు. విప్లవ పార్టీ, ప్రజా సైన్యం అవసరాన్ని ఆ రోజుల్లో చాలా మంది విప్లవ నాయకులు చెప్పారు. కానీ ఆయనలా మరెవరూ గుర్తించలేదని నిస్సంకోచంగా చెప్పవచ్చు. అందుకే కమ్యూనిస్టు ఉద్యమానికి సాయుధ వర్గ యుద్ధాన్ని ఆయన కేంద్రం చేశారు.
రివిజనిస్టు నిర్మూలన గురించి ఆయన తీవ్రంగా ఆలోచించాడు. అలాంటి వైఖరులే తీసుకున్నాడు. విప్లవోద్యమంలోకీ ప్రవేశించిన కొత్త రివిజనిస్టు పోకడలపై అంతే తీవ్రంగా స్పందించాడు. చుట్టూ ముసురుకున్న అనేక రకాల రివిజనిజాల నుంచి విప్లవ పంథాను కాపాడటమే ఆయన లక్ష్యం. ఆయన తీసుకున్న వైఖరులన్నిటినీ ఈ స్పిరిట్‌తోనే చూడాలి.
రాజ్య నిర్బంధంతో సహా అనేక అంతర్గత కారణాలతో చారుమజుందార్‌ కళ్లెదుటే ఉద్యమం దెబ్బతినిపోయింది. 1972 జూలై 28న అమరుడయ్యాడు. ఆ తర్వాత ఎక్కడికక్కడ విప్లవోద్యమ పునర్నిర్మాణ ప్రయత్నం మొదలైంది. అనేక బృందాల, వ్యక్తుల నాయకత్వంలో ఇదంతా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో చారుమజుందార్‌ మార్గంలో మిగిలిన నాయకులు కొండపల్లి సీతారామయ్య, కెజి సత్యమూర్తి, రవూఫ్‌ మాత్రమే. కానీ గతాన్ని లోతుగా సమీక్షించారు. విప్లవానికి మార్గం వేశారు. చారుమజుందార్‌ వ్యతిరేకత తారా స్థాయిలో ఉన్న రోజుల్లో ఆయన విప్లవ పాత్రను ఆనాటి సీఓసీ సగౌరవంగా ఎత్తిపట్టింది. ఇంకో పక్క చారుమజుందార్‌ వీరారాధన ఉన్న రోజుల్లోనే ఆయన పాత్రను అత్యంత నిశితంగా అంచనా వేసింది. ఈ రెంటి మధ్యనే ఆయనను తన నాయకుడిగా గుర్తించింది. అద్భుతమైన ప్రజాపంథాను ఆచరణలో పెట్టింది.
చారుమజుందార్‌ పాత్ర వలెనే ఆయనపై ఆనాటి సీవోసీ అంచనా చారిత్రాత్మకం. ఇవేవీ దాపకరికం కాదు. చరిత్రలో భాగం. చరిత్రను నిర్మించే ప్రజల చైతన్యంలో భాగం. అందువల్లే ఉత్తర తెలంగాణ నుంచి దండకారణ్యం దాకా విప్లవోద్యమం విస్తరించింది. మధ్య భారతం నుంచి తూర్పు తీరానికి చేరుకుంది. ఆనాటి సీవోసీ పీపుల్స్‌వార్‌గా, సీపీఐ మావోయిస్టుగా దేశంలోని విప్లవ శక్తుల ఐక్య నిర్మాణంగా కొనసాగుతోంది.
దీని వెనుక చారుమజుందార్‌ మార్గం ఉన్నది. వర్గ పోరాటాన్ని దృఢంగా ఆచరించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. పార్లమెంటరీ పంథాను తిరస్కరించి ప్రజాయుద్ధ పంథాను కొనసాగిస్తున్నందు వల్లే ఈ చరిత్ర నిర్మాణమైంది. విప్లవ పార్టీ, సుశిక్షిత ప్రజా సైన్యంతోపాటు గెరిల్లా జోన్ల నిర్మాణం, ప్రజా రాజ్యాధికారం, ప్రత్యామ్నాయ అభివృద్ధి విధానం.. మొదలైన భావనలు ఎన్నో ఆయన అందించారు. వాటి విస్తృత రూపమే ఇవ్వాల్టి మావోయిస్టు ఉద్యమం.
వీటితోపాటు చారుమజుందార్‌ నూతన మానవ ఆవిర్భావం గురించి కూడా కలగన్నాడు. అందువల్లే నిలువ నీటి సంస్కృతిని తిరస్కరించాడు. విప్లవానికి ఆటంకమైన పాత భావాలను తుడిచేయమని పిలుపు ఇచ్చాడు. నక్సల్బరీ తొలి రోజుల్లోని విగ్రహ విధ్వంసంలోని స్ఫూర్తి ఇదే. సాహిత్య కళా రంగాల్లో ప్రగతి వ్యతిరేకమైన భావాలన్నీ నక్సల్బరీ వెల్లువలో కొట్టుకపోయాయి. కొత్త భావాలు వికసించాయి. కొత్త చరిత్ర నిర్మాణ క్రమం ఆరంభమైంది. చరిత్రను అధ్యయనం చేసే నూతన పద్ధతులను నక్సల్బరీ తీసుకొచ్చింది. మొత్తంగా సామాజిక శాస్త్రాల అధ్యయన పద్ధతే మారిపోయింది. చివరికి భాష నుడికారాన్ని సహితం నక్సల్బరీ విప్లవీకరించింది. అందువల్లనే వర్గపోరాటం, నాగరికతా వికాసం, సాంఘిక విముక్తి క్రమంలో ఇవాళ విప్లవోద్యమం వేలాది మంది నూతన మానవ వ్యక్తిత్వాలను మనకు పరిచయం చేస్తోంది.
ఈ మార్గం అలవోకగా సాగడం లేదు. తొలినాళ్లలోని చారుమజుందార్‌ ఆలోచనలు, ఆచరణ రూపాల మదింపు వల్లనే ఇదంతా సాధ్యమవుతోంది. విప్లవోద్యమం వర్తమాన చారిత్రక సమయ సందర్భాల అర్థాలు తెలుసుకొనే లోతైన సిద్ధాంత కృషి చేస్తోంది. కేవలం సిద్ధాంతాల వల్లెవేతకే పరిమితం కాకుండా కత్తివాదరలాంటి ఆచరణను కొనసాగిస్తోంది. వేలాది మంది అద్భుతమైన ఈ నేల వీరుల త్యాగాల వల్లనే విప్లవోద్యమం ప్రత్యామ్నాయశక్తిగా నిలదొక్కుకున్నది. ఈ క్రమంలో అనేక ఆంతరంగిక సంక్షోభాలను అనుభవించింది. వర్గపోరాటం గీటురాయి మీద వాటిని అధిగమించింది. లక్షలాది సైనిక బలగాలతో డజన్ల కొద్ది అభియాన్లను ఎదుర్కొన్నది. లెక్కలేనన్ని సిద్ధాంత దాడులను తిప్పికొట్టింది. ఎన్నో ఓటములను చవి చూస్తూ విజయపథంలో సాగిపోతున్నది. నిత్యం మారుతున్న సంక్షోభ సమాజం నుంచి అనేక సవాళ్లను సాహసోపేతంగా స్వీకరిస్తున్నది. ప్రపంచంలో విప్లవ శిబిరమే లేని ప్రత్యేక చారిత్రక పరిస్థితుల్లో తాను నిలదొక్కుకున్నది. ఇవాళ అంతర్జాతీయ కార్మికర్గానికి తానే స్పూర్తిదాయక కేంద్రంగా నిలబడింది.
భారత మావోయిస్టు ఉద్యమం సాధిస్తున్న ఈ విజయాల వెనుక చారుమజుందార్‌ స్ఫూర్తి ఉన్నది. ప్రాణాలను పణం పెట్టే సంసిద్ధత ఉన్నది. వేయి కత్తివేట్లకయినా వెరవని సాహనం ఉన్నది. అందువల్ల చారుమజుందార్‌ శతజయంతి విప్లవశక్తులకు ఉత్తేజపూరిత చారిత్రక సందర్భం. ఇది ఒక వ్యక్తిని తలచుకొని పులకించడం కాదు. చరిత్ర వల్ల నిర్మాణమైన వ్యక్తి తిరిగి చరిత్ర నిర్మాణంలో పోషించిన పాత్రను గుర్తు చేసుకోవడం. చరిత్ర అంటున్నామంటే వర్తమానం మీదుగా భవిష్యత్తులోకి సాగే అనంత ప్రయాణం. ఈ మార్గంలో విస్తరిస్తున్న ఆ వ్యక్తి ఆలోచనలను, ఆచరణను గుర్తించి అంచనా వేయడం. అంటే చారుమజుందార్‌ నక్సల్బరీ పంథా రూపశిల్పి మాత్రమే కాదు. దాని గత వర్తమానాల సంభాషణగా భవిష్యత్తులోకి విస్తరిస్తున్న విప్లవ దార్శనికత. అందువల్ల ఈ శతజయంతిని నిర్వహించడానికి ఈ కమిటీ ఏర్పడింది. ఈ సదస్సును నిర్వహిస్తోంది. అందరికీ ఆహ్వానం. తప్పక రండి.
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
శతజయంతి సదస్సు, హైదరాబాదు
20, అక్టోబర్‌ 2019, ఉదయం 10 గంటల నుంచి 6 గంటల దాకా
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌
కార్యక్రమం
ఉదయం 10 గంటలకు ప్రారంభ సమావేశం
ఆహ్వానం: పద్మకుమారి
అధ్యక్షత: డా. శ్రీనివాస్‌
వక్తలు: ప్రొ. హరగోపాల్‌(కన్వీనర్‌, శతజయంతి కమిటీ)
సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌
మొదటి సెషన్‌ అధ్యక్షత: ప్రొ. సుబ్బారావు
అంశం: చారుమజుందార్‌ నేపథ్యం- అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో రివిజనిస్టు వ్యతిరేక పోరాటం
వక్త: డా. విజయ్‌కుమార్‌
అంశం: భరత కమ్యూనిస్టు ఉద్యమంలో రివిజనిస్టు వ్యతిరేక పోరాటం
వక్త: పాణి
భోజన విరామం
రెండో సెషన్‌ అధ్యక్షత: కాశీం
అంశం: భారత విప్లవోద్యమంలో సీఎం పాత్ర- విశ్లేషణాత్మక అంచనా
వక్త: జి. కళ్యాణరావు
అంశం: చారుమజుందార్‌ మార్గంలో వర్తమాన విప్లవోద్యమం
వక్త: ఎన్‌. రవి
చారుమజుందార్‌ శతజయంతి కమిటీ
Keywords : charumajundar, maoists, revolution,
(2019-10-19 11:22:48)

Nessun commento:

Posta un commento