venerdì 13 ottobre 2017

pc 13 ottobre - Libertà per tutti i prigionieri politici in India - verso una nuova giornata di lotta internazionale - ICSPWI info csgpindia@gmail.com

పదేళ్ళ అక్రమ నిర్బంధం నుండి విడుదలైన పద్మక్కకు హార్దిక స్వాగతం !

పదేళ్ళ
పదేళ్ళు అక్రమ నిర్బధం తర్వాత పద్మక్క మంగళవారంనాడు జైలు నుండి విడుదలైంది. జైలు నుండి విడుదలైన పద్మక్కకు స్వాగతం..
2007 లో పద్మక్కను అరెస్టు చేసింది మొదలు ఆమెపై అనేక కేసులు మోపుతూ జైలు నుండి విడుదల కాగానే మళ్ళీ మళ్ళీ అరెస్టు చేస్తూ పదేళ్ళపాటు ఆ కామ్రేడ్ ను అక్రమ నిర్బధంలో ఉంచారు. ఆమెపై పెట్టిన ఏకేసు కూడా నిరూపించబడలేదు. చివరకు తనపై మోపబడిన అన్ని కేసుల్లో ఆమె నిర్దోషిగా తేలి ఈ మంగళవారం జగదల్ పూర్ జైలు నుండి విడుదలైంది.
పద్మక్క అరెస్టు నాటి నుండి తనను ఎలా అక్రమ కేసుల్లో ఇరుకించారో. ఒక కేసునుండి నిర్దోషిగా విడుదల కాగానే జైలు ఆవరణలోనే మళ్ళీ ఎలా అరెస్టు చేశారనే విషయాన్ని పద్మక్క స్వయంగా 05.05.2015 నాడు ఛత్తీస్ గఢ్ కొండ గావ్ జిల్లా న్యాయ సేవా విభాగం రాసిన లేఖ పూర్తి పాఠ‍ం కింద ఇస్తున్నాం.

జిల్లా న్యాయ సేవా విభాగం,
కొండ గావ్, ఛత్తీస్ గఢ్
విషయం : న్యాయ సహాయానికి సంబంధించి
గౌరవనీయులకు,
నా పేరు పద్మ. (భర్త: బాలకృష్ణ). అందరికి నమస్కారం. నేను 13 ఆగస్టు 2007 నుండి జగదల్ పూర్ కేంద్ర కారాగారంలో విచారణలో ఉన్న ఖైదిగా ఉన్నాను.
నేను దాదాపు గత ఎనిమిది సంవత్సరాల నుండి జైలు జీవితాన్ని గడుపుతున్నాను. 2007 ఆగస్టు 3 న పోలీసులు నన్ను అనుమానంపై అరెస్టు చేసి, పది రోజులవరకు తమ అధీనంలో ఉంచుకొని, నేర సంఖ్య: 17/06 కేసులో నిందితురాలిని చేసి 2007 ఆగస్టు 13న జగదల్ పూర్ కేంద్ర కారాగారానికి పంపారు. దంతెవాడలోని సెషన్స్ కోర్టులో రెండు సంవత్సరాల పాటు విచారణ ప్రక్రియ కొనసాగిన తరువాత , 2009 ఆగస్టు 10, ఉదయం 11 గంటలకు నిర్దోషిగా పేర్కొంటూ సెషన్స్ జడ్జి తీర్పునిచ్చారు.
నియమానుసారం వెంటనే జైలుకు పంపి, లాంఛనాలను పూర్తి చేసి వదిలిపెట్టాల్సి ఉండింది. కానీ పోలీసులు నన్ను వెంట తీసుకొని వేర్వేరు పోలీసు స్టేషన్లు, న్యాయస్థానాలు తిరిగి దొంగ వారంటు కోసం ప్రయత్నాలు చేశారు. ఇందు కోసం ఏవేవో సాకులు చూపి చట్ట వ్యతిరేక పద్ధతిలో నన్ను 36 గంటల పాటు తమ అధీనంలో ఉంచుకున్నారు. నకిలీ వారంట్ దొరికిన తరువాత 2009 ఆగస్టు 11 రాత్రి 11-12 గంటల మధ్య నన్ను రాయపూర్ సెంట్రల్ జైలుకి పంపారు. 12వ తేదీ పొద్దున్న విడుదలకు సంబందించిన లాంఛనాలు హడావిడిగా పూర్తి అయ్యి ఇంకా బయట అడుగు పెట్టక ముందే, కాంకేర్ పోలీసులు గేటు బయటనే ఘెరావ్ చేసి నకిలీ వారంట్ తో అరెస్టు చేశారు.
ఒక నెల రోజుల తరువాత 2009 సెప్టెంబర్ 6న బిజాపుర్ జిల్లా, మద్దేడ్ పోలీసు స్టేషన్ కి చెందిన ఇద్దరు ASIలు, సెంట్రల్ జైలు మహిళా విభాగంలోకి వచ్చి నవంబర్ 2006, జనవరి 2007 ఘటనల్లో నిందితురాలిని అని చెప్పి ఏవేవో ప్రశ్నలు వేస్తూ ఫారమ్ లు నింపారు. అలా ఇష్టం వచ్చినప్పుడు కేసులు పెట్టడం అనేది ఇక్కడితో ఆగిపోలేదు. జనవరి, 2010లో జగదల్ పూర్ సెషన్స్ జడ్జి జారీ చేసిన వారంట్ లో బిజాపూర్ జిల్లా, భోపాలపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో 1989 లో జరిగిన ఘటనలో నిందితురాలిగా పేర్కొన్నారు.
వివిధ న్యాయస్థానాల్లో జరిగిన చట్టపర ప్రక్రియల తరువాత పైన పేర్కొన్న కేసులన్నింటిలో నిర్దోషిగా పేర్కొంటూ, 2014 డిసెంబర్ 17 సాయంత్రం 4.30 గంటలకు తీర్పు చెప్పారు. లాకప్ సమయానికంటే ముందుగానే, అంటే 7 గంటలవకముందే జైలుకి చేరుకున్నప్పటికీ, వెంటనే బయటకు పంపకుండా, ముందుగానే లాకప్ చేసి మర్నాడు (18-12-2014) జైలు ముందర పోలీసుల మోహరింపు జరిగాక విడుదల లాంఛనాలను హడావిడిగా పూర్తి చేశారు.
నారాయణ్ పూర్ జిల్లాకి సంబంధించి 1998 సంవత్సరం నాటి ఒక వారంట్ పెండింగ్ లో ఉందనీ, ఐ.జి.తో మాట్లాడితే ఆ వారంటు రద్దు కావచ్చనీ, జైలు బయట ఉన్న పోలీసులు నా వకీలుకి చెప్పారు. కానీ ఈ వంకతో అనధికారంగా అరెస్టు చేసి జగదల్ పూర్ పోలీసు స్టేషన్ లో ఉంచారు. నారాయణపూర్ ఎస్‌ఐ నా పేరు, అడ్రసు అడిగి ఒక తెల్లకాయితం మీద రాసింది. 2014 డిసెంబర్ 18న మధ్యాహ్నం దాదాపు ఒంటి గంట ప్రాంతంలో అరెస్టు చేసినట్లు చూపించి జగదల్ పూర్ లో గౌరవనియులైన ప్రధాన మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచారు. ఆ తరువాత నారాయణపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో 1998 సంవత్సరానికి చెందిన రెండు వారంట్లు వున్నాయని జగదల్ పూర్ II అప్పర్ కోర్టు న్యాయస్థానంలో సంతకం చేయించారు. నారాయణపూర్ జిల్లా బెనూర్ పోలీసు స్టేషన్ పరిధిలో 1998 నాటి ఒక వారంట్ వుందని చెప్పి, అక్కడ నుంచి జగదల్ పూర్ లోని III అప్పర్ సెషన్స్ కోర్టుకు తీసుకువెళ్లి గౌరవనీయులైన న్యాయాధీశుల ముందు ప్రవేశపెట్టారు. నాతో పోలీసులు వ్యవహరించిన తీరు, నా జుడీషియల్ కస్టడీ అవధి వగైరాల గురించి జడ్జిగారికి మౌఖికంగా తెలియచేశాను.
2007 లో తమ అధీనంలో నన్ను చాలా కాలం వరకు వుంచుకొని, కేవలం ఛత్తీస్ గఢ్ పోలీసులే కాదు, వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులు కూడా ఇంటరాగేషన్ చేశారు. వందల కొద్ది ప్రశ్నలు వేసీ, రికార్డ్ లను తిరగేసినప్పటికీ, నాకు వ్యతిరేకంగా పోలీసులకు నిర్దిష్టమైన సాక్ష్యమేమీ దొరకలేదు. ఏ గ్రామ ప్రజలు కూడా నన్ను గుర్తు పట్టలేదు. ఎందుకంటే, నేను ఆ గ్రామాలకు పోవడం మాట అటుంచి, వాటి పేర్లను కూడా వినలేదు. అయినప్పటికి, జైలుకు పంపాలనే ఉద్దేశ్యంతో నకిలీ వారంట్ తో 17/06 (సంకెన పల్లి, మద్దెడ్ పోలీసు స్టేషన్) కేసులో నిందితురాలిగా చూపించారు. జైలులో వుండగానే కేసుల సంఖ్య పెరిగిపోతోంది. జైలులో మా హక్కుల గురించి గొంతెత్తడమే నేరమైపోతోంది.
2014 డిసెంబర్ 18న మూడోసారి అరెస్టు చేసి, ఒక వారంట్ పెండింగ్ వుందని చెప్పి, కోర్టులో ఉన్నప్పుడే కొన్ని గంటల వ్యవధిలో 4 వారంట్లను తయారు చేశారు. మరుసటి రోజు 2014 డిసెంబర్ 19 సాయంత్రం 7 గంటలకు జైలు అధికారుల నుంచి పిలుపు వచ్చిందని చెప్పి లాకప్ చేసిన బ్యారక్ తాళం తీసి నన్ను వారంట్ శాఖకు తీసుకువెళ్లారు. అక్కడ సివిల్ దుస్తుల్లో ఉన్న వ్యక్తులు ఇద్దరు తాము ఫరస్ గఢ్, మద్దెడ్ పోలీసు స్టేషన్ లకు చెందిన ఏ‌ఎస్‌ఐలమని పరిచయం చేసుకుని, ʹబస్తర్ డివిజన్ ఐ.జి, 2014 డిసెంబర్ 17నాడు పోలీసు స్టేషన్ లన్నింటికి పంపిన వైర్ లెస్ ఆదేశానుసారం మా రికార్డ్స్ ని వెతికిన తరువాత, పద్మ (భర్త పేరు – తెలియదు) పేరుతో ఫరస్ గఢ్ పోలీసు స్టేషన్లో 2008, 2004 కు సంబందించిన రెండు కేసులు; మద్దేడ్ స్టేషన్ లో 2010లో ఒక కేసు వున్నాయిʹ అని చెప్పారు. నేను వారికి నా వాదనను వినిపించి నా పై కేసు పెట్టాలా వద్దా అనే విషయాన్ని వారి విచక్షణా జ్ఞానానికి వదిలివేశాను. వాళ్ళిద్దరూ లేచి వెళ్లిపోతుంటే, ʹనన్ను ఆ కేసుల్లో ఆరోపిని చేయదల్చుకోకుంటే కనుక, మరింకెప్పుడూ కూడా నాపై ఆ కేసులను (అంటే విడుదలైన తరువాత కూడా) పెట్టమని రాసియ్యండిʹ అని విన్నవించుకున్నాను. ʹఈ విషయం పై ఆఫీసర్లకు రిపోర్టు చేస్తాముʹ అంటూ వెళ్ళి పోయారు. కానీ ఇంతవరకు వారి నుండి ఎలాంటి ప్రతిస్పందన లభించలేదు.
III ADJ, కొండగావ్ లో 2015 జనవరి 24 న నన్ను హాజరు పరిచినప్పుడు, ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ పని అయిన తరువాత II ADJ కోర్టులో కూడా ప్రవేశ పెట్టాలనే జడ్జి గారి ఆదేశాన్ని మౌఖికంగా ఎస్‌.ఐ.కి చెప్పి వెళ్ళాడు. ADJ కోర్టులో హాజరు పరిచిన తరువాత, గౌరవనీయులైన జడ్జి గారు – 2005లో బస్తర్ జిల్లా, మార్ డూమ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలకు (2 కేసులు) సంబంధించిన కేసు చలాన్ లో పద్మ పేరు ఉందని చెప్పారు. నా వాదనను వినిపించిన తరువాత, చలాన్ లో పద్మ తండ్రి పేరు, ఇంటి అడ్రసు వగైరాలు లేవు కాబట్టి నేను విడుదలయ్యే అవకాశం వుందని అన్నారు. నన్ను కేసులన్నింటి నుంచి పూర్తిగా విముక్తి చేయాలని వారికి విజ్ఞప్తి చేశాను.
2015 ఫిబ్రవరి 7న జైలు అధికారులు పిలిచారని చెప్పి వారంట్ శాఖకు తీసుకువెళ్లి జగదల్ పూర్ గౌరవ ఫస్ట్ క్లాస్ జుడీషియల్ మేజిస్ట్రేట్ జారీ చేసిన ప్రొడక్షన్ వారంట్ ను చూపించారు. ʹబిజాపుర్ జిల్లా ఉసూర్ పోలీసు స్టేషన్ పరిధిలో 1992లో జరిగిన ఘటన నేరం సంఖ్య 736/92, సెక్షన్లు IPC 147, 148, 435/34 కింద నిందితురాలు పద్మక్క, భర్త సత్యన్న @గోపన్న, అడ్రసు: దుర్గాబాద్, కరీంనగర్ జిల్లా. పద్మక్క జగదల్ పూర్ కేంద్ర కారాగారంలో వుంటే కనుక అక్కడి కోర్టులో హాజరు పరచాలనీ, లేకపోతే ఆ విషయాన్ని కోర్టుకి తెలియచేయాలిʹ అని ఆ వారంట్ లో వుండింది. కేవలం పద్మ అనే పేరు తప్ప మిగతా ఏ వివరాలు నాతో సరిపోలవనీ, 1992లో నేను 12వ తరగతి చదువుతున్నాననీ, నా గురించిన మొత్తం వివరాలను తెలియచేస్తూ 2015 ఫిబ్రవరి 12న గౌరవనీయులైన JMFC కి విజ్ఞప్తిని పంపి, ఏం చేయాలో చెప్పమని కోరాను. కానీ ఇంతవరకు నాకు ఏ సమాధానమూ రాలేదు. (చట్టపరమైన విషయాలు తెలియకపోవడం వల్ల జైలు అధికారులు చెప్పినట్లుగా ఆ విజ్ఞప్తిని పంపించాను.)
2014 డిసెంబర్ 17న I/C, C/Room, KKP ద్వారా పంపబడిన వైర్ లెస్ మెసేజ్ కి జవాబుగా, డిసెంబర్ 19న కాంకేర్ జిల్లా, రావ్ ఘాట్ పోలీసు స్టేషన్ నుండి, పద్మ @ పద్మక్క (నక్సల్ మహిళ, కేస్కల్ దళం) పేరుతో (క్రైమ్ సంఖ్య 15/97, సెక్షన్ 147, 148, 149, 307 IPC 25, 27AA) ఉన్న వారంట్ పెండింగ్ లో ఉన్నదనే సమాచారం వచ్చిందనే విషయాన్ని జైలు అధికారులు నాకు 2015 ఫిబ్రవరి 16న తెలియచేసారు.
ఇలా కొత్త కొత్త కేసులు రావడమనే పరంపర అంతటితో ఆగలేదు. చాలా కాలం నుండి మానసిక వేదనకు గురవుతూండడం వల్ల ఆ ప్రభావం నా ఆరోగ్యంపై పడుతోంది.
2007లో నా అరెస్టు కేవలం అనుమానంతో జరిగిందని గౌరవనీయులైన సెషన్స్ జడ్జి 2009 లోనే ప్రకటించారు. అయినా, పోలీసులు తమ తప్పును ఒప్పుకోవడానికి బదులు, నిర్దోషినని తీర్పు వచ్చిన తరువాత కూడా మళ్ళీ మళ్ళీ అరెస్టు చేస్తూ, దొంగ కేసులు పెడుతూ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు. 2007లో పెట్టిన 17/06 కేసు, 2009లో పెట్టిన 5/07, 31/06 కేసులు ఒకే పోలీసు స్టేషన్ కి సంబంధించినవి. ఆ కేసు డాక్యుమెంట్ల ప్రకారం ఆ ఘటనలు కూడా 4,5 నెలల వ్యవధిలో జరిగాయి. 31/06 కేసులోనైతే 2009 జులై 25న పరారీలో ఉన్నాననే పేరుతో చలాన్ జారీ అయింది. ఒకవేళ పోలీసులు చెప్పేది నిజమే అయితే నేను 2007లో అదే పోలీసు స్టేషన్లో, వారి ఆధీనంలోనే ఉన్నాను, తరువాత కూడా జుడీషియల్ కస్టడీలోనే ఉన్నాను. కేవలం బంధించి ఉంచడమనేదే పోలీసుల లక్ష్యంగా స్పష్టమవుతోంది.
బీజాపూర్ జిల్లా, భోపాల పట్నం సరిహద్దులో 1989 లో జరిగిన ఘటనలో వుండిన 25-27 సంవత్సరాల పద్మ, కాంకేర్ జిల్లా, అమాబేడా సరిహద్దులో 1999లో జరిగిన ఘటనలో వున్న పద్మ, 2008లో బిజాపుర్ జిల్లా, ఫరస్ గఢ్ సరిహద్దులో జరిగిన ఘటనలో వున్న 25 సంవత్సరాల పద్మ- వీరందరూ ఒకే వ్యక్తి కావడం అనేది అసంభవం. కానీ పోలీసుల ప్రకారం మూడు ఘటనల్లోనూ జారీ అయిన వారంట్ నా పేరు మీదనే. ఆ వారంటులను చూసిన గౌరవనీయులైన జడ్జిగారే స్వయంగా, అనధికారికంగా, ఈ వారంట్లు నకిలీవి అనే విషయాన్ని ఒప్పుకున్నారు. న్యాయ ప్రక్రియ పేరుతో దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్బంధ జీవితాన్ని గడుపుతున్నాను.
వారంటులో పంచనామాలు వేర్వేరుగా ఉన్నప్పటికి ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని వారంట్లలోనయితే వివరాలను నన్ను అడిగి నింపారు. వారంట్లలో చట్ట ఉల్లంఘన కూడా జరిగింది. చలాన్ లో వుండే తప్పులకైతే లెక్కే ఉండదు. 2014 డిసెంబర్ లో పెట్టిన కేసులకి సంబంధించిన డాక్యుమెంట్లు నాకు అందనేలేదు. ఆరోపణలు తప్పు అని తెలిసినప్పటికి పోలీసులు తమకు ఇవ్వబడిన ప్రత్యేక అధికారాల్ని ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇందువల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఎంతోమందిలో నైపుణ్యము, సామర్ధ్యత వృధా అవుతున్నాయి. గడచిపోయిన అమూల్యమైన సమయం, జీవితాలు మళ్లి తిరిగిరావు. అయినప్పటికి ఇలాంటి అవ్యవస్థతకి బాధ్యతను ఎవరూ వహించరు. ఏళ్ళ తరబడి న్యాయ ప్రక్రియ పేరుతో ఇనుప చువ్వల వెనుక న్యాయం కోసం ఆశతో ఎదురుచూస్తూ కూచోవాల్సొస్తుంది. ఆటంకాలు కేవలం భౌతిక రూపంలో మాత్రమే ఉండవు. అడుగడుగునా అవమానాలపాలయ్యే పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తూంటుంది. అభివృద్ధి వుండదు. కనీస సౌకర్యాల కోసం దేబిరించాల్సొస్తుంది. హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పటికి భరించాల్సొస్తుంది. పద్ధతి ప్రకారం విచారణ జరగాలనే ప్రాధమిక హక్కుని డిమాండ్ చేయడం జైలు అధికారుల, పోలీసుల దృష్టిలో నేరమవుతోంది. ఇలాంటి స్థితిలో ప్రశాంతంగా ఎలా జీవించగలం?
దుఃఖభరితమైన జీవితాన్ని గురించి చెప్పడానికి ఈ వినతిపత్రం సరిపోయే మాధ్యమం కాదు. ʹఎక్కడైతే అన్యాయము లేదా ఇష్టారాజ్యం అమలవుతుందో అక్కడ న్యాయస్థానం కలిగించుకోవాలిʹ అని గౌరవనీయులైన సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి అన్న మాటలు విని నమ్మకం రేకెత్తుతుంది. మా దుఃఖాన్ని వినేవాళ్లు వున్నారు అనే ఊరట కలుగుతుంది.
కానీ పోలీసుల ఇష్టారాజ్యం, అన్యాయాల గురించి అక్కడి వరకు తెలిపే మాధ్యమాలు కావాలి. నాకు న్యాయాన్ని కలిగిస్తారని ఆశిస్తున్నాను.
అపరిమిత కాలం జైలులో బందీగా ఉండడం వల్ల నిరంతరం, ఆందోళన, మానసిక ఒత్తిడికి గురవుతూ, శారీరక, మానసిక అస్వస్థతలపాలవుతున్నాను. నాతో పాటు నా కుటుంబం కూడా ఆందోళన చెందుతున్నది. నా మీద బెంగ వల్ల వృద్ధురాలైన మా అమ్మ అనారోగ్యం పాలైంది. నన్ను కలవడానికి ఇంత దూరం రావడానికి ఆర్ధిక ఇబ్బందులు ఒక కారణమైతే భాష మరొక సమస్యగా వుంది. కనీసం అమ్మ గొంతు వినడానికి కూడా ఏళ్ల తరబడి తహతహలాడాల్సి వస్తోంది. కాలం గడుస్తున్న కొద్ది శక్తి, సామర్ధ్యాలు తగ్గిపోతున్నాయి. దీర్ఘకాలం నుండి అనేక సౌకర్యాలు, హక్కుల నుండి వంచితురాలనవుతున్నాను. న్యాయాన్నందించి సమాజంలో గౌరవంగా జీవించే అవకాశాన్ని కల్పించండి.
ఏళ్లతరబడి జైలులో ఉన్నతరువాత, విడుదలయ్యే రోజున స్వేచ్ఛ నుంచి వంచితురాల్ని చేసి పాత, అబద్ధపు వారంట్లతో అరెస్టు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఇలాంటి స్థితిలో నా అరెస్టుని చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటించడానికి ఈ వినతిని ఉన్నత న్యాయ స్థానానికి తీసుకెళ్ళండి.
మానవ హక్కులను పరిరక్షించడంలో మద్దత్తునిచ్చి న్యాయవ్యవస్థ మీద విశ్వాసాన్ని కలిగించండి. నాకు నిర్బంధ జీవితాన్నుండి విముక్తిని కలిగించి గౌరవంగా జీవించే అవకాశాన్ని కలగచేయండి. దయచేసి నా విన్నపాన్ని ఉన్నత న్యాయస్థానానికి తీసుకు వెళ్లడానికి సహాయం చేయండి. నాపై పెట్టిన కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లని ఇప్పించండి.
సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ
మీ విధేయురాలు,

Nessun commento:

Posta un commento